మాయమాటల ఉచ్చులో పడి… క్షణిక సుఖాలకు లోనై.. వేధింపుల భరించలేక… పవిత్ర బంధం.. ఎగతాళి


కొత్తగూడెం : మార్చి 19: సహజీవనానికి అడ్డొస్తున్నాడన్న కోపంతో కొత్తగూడెం సన్యాసిబస్తీకి చెందిన గాయపాక ప్రవీణ్‌కుమార్‌ (35)ను ప్రియుడితో కలిసి భార్య లావణ్య అంతమొందించింది. తనతో విడాకులు తీసుకోకుండా వేరొకరితో సహజీవనం చేస్తున్నావెందుకని నిలదీయడమే అతని పాలిట మృత్యుపాశమైంది.
జనవరి 4: చుంచుపల్లి మండలం గాంధీకాలనీకి చెందిన శ్రీనివాస్‌కు 29 ఏళ్ల క్రితం సీతామహాలక్ష్మితో వివాహమైంది. రెవెన్యూ శాఖలో అటెండర్‌గా పనిచేసే అతడు మద్యానికి బానిసయ్యాడు. రెణ్నెల్ల క్రితం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తను భార్య కర్రతో కొట్టి చంపింది. ఇంట్లో జారిపడ్డాడని నమ్మించే ప్రయత్నం చేసింది.
జనవరి 20: గుండాల మండలానికి చెందిన ఓ యువతితో అదే గ్రామానికి చెందిన యువకుడికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కట్న వేధింపులతో భార్య పుట్టింటికి వెళ్లగా.. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. నిలదీసేందుకు వెళ్లిన అత్తింటి వారిపై యవకుడు దాడి చేయగా.. వారు ప్రతిదాడికి పాల్పడ్డారు.
జనవరి 26: ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన రాంబాబు (పేరుమార్చాం)కు మహబూబాబాద్‌ జిల్లా మరిపెడకు చెందిన మహిళతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. అతడు మద్యానికి బానిసయ్యాడు. పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టినా మారలేదు. ఓ రోజు అతడు భార్యపై ఆగ్రహంతో గొడ్డలితో విచక్షణా రహితంగా దాడిచేశాడు.
అనుమానం.. వివాహేతర సంబంధం.. మద్యం అలవాటు.. ప్రస్తుతం భార్యాభర్తల మధ్య విభేదాలకు ఇవే ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి. కొందరు తెగించి బంధాలను అడ్డుతొలగించుకునేందుకూ వెనకాడటం లేదు. ఇటీవల కాలంలో ఉమ్మడి ఖమ్మంలో ఇలాంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అధిక శాతం భర్త మద్యం అలవాటు కారణంగా సంసారాల్లో చిచ్చురేగుతోంది. మత్తుకు బానిసైన వారిలో ‘అనుమానం’ పెనుభూతం అవుతోంది. ఇది దంపతుల మధ్య ఎడబాటుకు కారణమవుతోంది. సర్దుబాటుతో సమస్య తీరే అవకాశం ఉన్నా.. కక్షతో దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్నారు. మరికొందరు వ్యక్తిగత సుఖం కోసం పెడదోవ పడుతున్నారు. వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. భర్త ప్రవర్తనతో వేగలేక కొందరు ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నారు.ఆగ్రహావేశాలు పక్కనపెడితే, ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం దొరుకుతుందని, మానసిక నిపుణులు, పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు కారణాలివే..
పరస్పర అవగాహన లేకపోవడం. పట్టుదల, పంతాలకు వెళ్లడం.
ఒకరిపై మరొకరు విశ్వాసం కోల్పోవడం. అనుమానాలు పెనుభూతం గా మారడం.పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిందని.. ప్రతీకారమే శరణ్యమనుకోవడం.మద్యం కారణంగా కుటుంబాన్ని పట్టించుకోక పోవడం.వివాహేతర సంబంధాలు.అదనపు కట్నం వేధింపులుధనాపేక్ష, మితిమీరిన స్వేచ్ఛ కోరుకోవడంక్షణికావేశానికి లోనై తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *