ఇంపాల్ : మణిపూర్‌లో గిరిజన గ్రూపులు చేస్తున్న ఆందోళన వల్ల 8 జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్టీ హోదా గురించి ఇటీవల కోర్టు తీర్పు ఇవ్వడాన్ని నిరసిస్తూ గిరిజనలు నిరసనలు చేపట్టారు. నిన్న రాత్రి ఇంపాల్, చురాచంద్‌పూర్, కంగ్‌పోక్కి ప్రాంతాల్లో హింసచెలరేగింది. దీంతో మొత్తం 8 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలో 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని ప్రభుత్వం నిలిపివేసింది.పరిస్థితుల్ని అదపులోకి తెచ్చేందుకు ఆర్మీనిక రంగంలోకి దింపారు. ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్ దళాలు హింసాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. ఆర్మీ క్యాంపుల్లో దాదాపు 7500 మందికి ఆశ్రయం కల్పించారు. మైటిస్ వర్గానికి గిరిజన హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మణిపూర్‌లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు.మణిపూర్ కాలిపోతోందని, దయ చేసి ఆదుకోండి అని బాక్సర్ మేరీ కోమ్ తన ట్వీట్‌లో కోరారు. గత రాత్రి నుంచి మణిపూర్‌లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారినట్లు ఆమె చెప్పారు. హింసలో కొందరు తమ కుటుంబసభ్యుల్ని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఏటీఎస్‌యూఎం ఆధ్వర్యంలో గిరిజన సంఫీుభావ ర్యాలీ నిర్వహించారు. మైటిస్ వర్గానికి ఎస్టీ హోదా ఇవ్వడాన్ని ఆ సంఘం వ్యతిరేకిస్తోంది. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని మైటిస్ వర్గం ఇటీవల ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేసింది. ఆ ఉద్యమం ఊపందుకోవడంతో.. గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్‌తో అక్కడ పరిస్థితి గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చించారు.