CM Cup 2023: మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని సర్కార్ భావించింది. ఎంతో టాలెంట్ ఉండి గ్రామాలకే పరిమితమవుతున్న క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు, వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్-2023 క్రీడాపోటీలకు శ్రీకారం చుట్టింది. 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ని మండల కేంద్రాల్లో అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్ భాల్ విభాగాల్లో మొదట మండల స్థాయిలో పోటీలను 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహిస్తారు.
ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయనున్నారు. జిల్లా స్థాయిలో పోటీలను ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు పోటీలు నిర్వహించనున్నారు. మండల స్థాయిలో విజయవంతంగా నిర్వహించడానికి మండల స్థాయి అధ్యక్షులు, చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీడీవో, తహసీల్దార్, ఎస్సై మెంటర్లుగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, చైర్మన్, అదనపు కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి, వైస్ చైర్మన్ తదితరులు నిర్వహణ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఇప్పటికే మండల కేంద్రాల్లో క్రీడలకు మైదానాల్లో కావాల్సిన ఏర్పాట్లను ఆయా మండలాల అధికారులు ఏర్పాట్లు చేశారు. మండలంలోని క్రీడాకారులు సీఎం కప్ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయాలని సీఎం కప్ చైర్మన్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి కోరారు.