
మచిలీపట్నంలో ఏడుగురు వైసీపీ నేతల అరెస్టుతో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పర్యటనలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై అరెస్టులు జరగ్గా, మాజీ మంత్రి కుమారుడు సహా పలువురిపై కేసులు నమోదు అయ్యాయి.
Seven YSRCP leaders were arrested in Machilipatnam following allegations of attempted unrest during Home Minister Vangalapudi Anitha’s visit. Among the accused is the son of a former minister, intensifying the political heat in the region.
మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్): మచిలీపట్నంలో జరిగిన ఘటనలపై ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మచిలీపట్నం పర్యటనలో పాల్గొన్న సమయంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఇనగుదురుపేట పోలీసులు చర్యలు ప్రారంభించారు. టీడీపీ నేత బొడ్డు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో 19 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో మాజీ మంత్రి పేర్ని నానికి కుమారుడు పేర్ని కిట్టు ఉండడం రాజకీయంగా కీలకంగా మారింది. అతనిపై ఏ19 నిందితుడిగా కేసు నమోదైంది. మునిసిపల్ పాలక వర్గంలో కీలకంగా ఉన్న మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతితో పాటు మహిళా కార్పొరేటర్లు వాణి కుసుమ, బందెల కవితలపైనా కేసులు నమోదయ్యాయి.
అరెస్టుల బారినపడిన మిగిలిన నేతల్లో మేకల సుబ్బన్న, గూడవల్లి నాగరాజు, నోబుల్ థామస్, కొలుసు హరిబాబు, తుమ్మలపల్లి జగన్నాధరావు, బాబావలీ, తిరులమలశెట్టి వర ప్రసాద్ ఉన్నారు. వారందరినీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి తదుపరి విచారణ చేపట్టారు.
ఈ అరెస్టులతో మచిలీపట్నంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ శ్రేణులు దీనిని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తమ నేతలను అసత్య ఆరోపణలతో లక్ష్యంగా చేసుకున్నారంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.