వనస్థలిపురం : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే.. కట్టుకున్న భార్యను కిరాతకంగా కడతేర్చాడు. కన్నబిడ్డల ముందే భార్య గొంతు కోసి కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగింది. పోలీసులు, స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా దేవరుప్పలకు చెందిన శోభ (37)కు 15 ఏళ్ల క్రితం సూర్యాపేట జిల్లా నర్సింహులగూడెం గ్రామానికి చెందిన కుంచారం రాజ్‌కుమార్(38)తో వివాహం జరిగింది. రాజ్‌కుమార్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎ?ఫ)లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గతంలో రాజ్‌కుమార్ తనను వేధిస్తున్నాడని శోభ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా రాజ్‌కుమార్‌లో మార్పు రాలేదు. నాలుగేళ్ల క్రితం నగరానికి బదిలీపై వచ్చారు. వనస్థలిపురంలోని గౌతవిూనగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
రాజ్‌కుమార్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, విడాకులు ఇవ్వాలంటూ శోభను వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. రోజూ మద్యం సేవించడంతో పాటు భార్యతో గొడవ పడుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రాజ్‌కుమార్ విధులు ముగించుకుని ఇంటికి రాగానే భార్యతో గొడవపడ్డాడు. విడాకులివ్వాలని అడగ్గా.. ఆమె అంగీకరించకపోవడంతో చేయి చేసుకున్నాడు. తప్పించుకుని పై అంతస్తు నుంచి కిందికి దిగి వస్తుండగా రాజ్‌కుమార్ ఆమె జుట్టుపట్టుకుని లాగి కిందపడేశాడు. కత్తి తీసి ఆమె గొంతు కోశాడు. అడ్డుకోబోయిన పెద్ద కొడుకు సాత్విక్‌ని సైతం చంపేందుకు ప్రయత్నించాడు. సాత్విక్ తప్పించుకొని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని, రక్తపు మడుగులో ఉన్న శోభను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. పోలీసులు వచ్చేలోపే రాజ్‌కుమార్ పారిపోయాడు.
మా నాన్ననీ అలాగే చంపుతా..
కళ్లముందే అమ్మను చంపిన నాన్నను ఎప్పటికైనా చంపేస్తానని మృతురాలి పెద్ద కొడుకు సాత్విక్(14) చెప్పాడు. వనస్థలిపురం పీఎస్ ముందు స్వాతిక్ తన తమ్ముడు లిఖిత్(11)తో కలిసి మాట్లాడుతూ.. మా అమ్మను నాన్న చంపుతున్నాడని పోలీసులకు చెప్పినా సకాలంలో స్పందించలేదని వాపోయాడు. రాజ్‌కుమార్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.