
ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం అనే సంకల్పంతో మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వంలో కానూరులో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం జరిగింది. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టే దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు.
In Kanuru, under the leadership of Minister Kandula Durgesh, the ‘Swarnandhra–Swachhandhra’ initiative was conducted with a call to reduce plastic usage and promote clean surroundings. He urged people to reject plastic and adopt sustainable practices.
నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి మండలం కానూరు గ్రామంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి పెరుగుతున్న ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీ, మానవహారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల ఓజోన్ పొరకు ఏర్పడే నష్టం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రభావం, భూమిలో కరగని ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలను మంత్రి వివరించారు. ప్రజలందరూ ఇంట్లోని చెత్తను వేరు చేసి, రీసైక్లింగ్‌కు అవకాశం కల్పించాలని సూచించారు. ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులు, గాజు సీసాలను వినియోగించాలని ప్రోత్సహించారు.
ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా జరుపుకుంటూ, ఒక్కో థీమ్‌తో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జులై మాసానికి ‘ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం’ అనే నినాదం కేంద్రంగా పనిచేస్తోందని చెప్పారు.
ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను ప్రజలు అనుసరిస్తే ప్లాస్టిక్ రహిత గ్రామాలవైపు అడుగులు వేయొచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రాన్ని పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.