అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హతల వ్యవహారంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భంగపాటు ఎదురైంది. ఈ అంశంపై గుజరాత్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రధాని డిగ్రీ, పీజీ పత్రాలను పీఎంవో చూపించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఏడేళ్ల క్రితం కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన న్యాయస్థానం.. కేజ్రీవాల్‌కు రూ.25వేల జరిమానా కూడా విధించింది. అసలేం జరిగిందంటే.. ప్రధాని మోదీ విద్యార్హతలపై ఆరోపణలు చేస్తున్న కేజ్రీవాల్.. ఆయన డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ల కోసం 2016లో సహచట్టం ద్వారా కేంద్ర సమాచార కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన సీఐసీ.. మోదీ డిగ్రీ, పీజీ పత్రాలను చూపించాలంటూ పీఎంవో కార్యాలయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పీఐవో), గుజరాత్, దిల్లీ యూనివర్శిటీల పీఐవోలను 2016 ఏప్రిల్‌లో ఆదేశించింది. అయితే మూడు నెలల తర్వాత సీఐసీ ఆదేశాలను సవాల్ చేస్తూ గుజరాత్ యూనివర్శిటీ.. రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సీఐసీ ఆదేశాలపై అప్పుడు హైకోర్టు స్టే విధించింది. ఇటీవల ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై హైకోర్టు గత నెల విచారణ జరిపింది. గుజరాత్ యూనివర్శిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘మోదీ విద్యార్హతలను దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఆ వివరాలు ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో, యూనివర్శిటీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రజాస్వామ్యంలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేట్ అయినా.. నిరక్షరాస్యుడైనా పెద్ద భేదమేమీ ఉండదు. అంతేగాక.. ఈ వివరాలను ప్రత్యేకంగా బయటపెట్టడంలో ప్రజా ప్రయోజనమేం లేదు. ఇక ప్రధాని వ్యక్తిగత గోప్యతపై ఇది ప్రభావం చూపుతుంది. ఓ వ్యక్తి బాధ్యతారహితమైన అత్యుత్సాహానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని తుషార్ మెహతా వాదించారు. అయితే, ఈ వాదనలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది ఖండిరచారు. ఆ పత్రాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో లేవని, ఆధారాల కోసమే వాటి కాపీలను అడుగుతున్నామని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నేడు కీలక తీర్పు వెలువరించింది. మోదీ సర్టిఫికెట్లను పీఎంవో గానీ.. యూనివర్శిటీ గానీ చూపించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా ఆ పత్రాలను కోరిన కేజ్రీవాల్‌కు రూ.25వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా గుజరాత్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో జమ చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించింది. కాగా.. ప్రధాని మోదీ 1978లో గుజరాత్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్, 1983లో దిల్లీ యూనివర్శిటీ నుంచి పీజీ పూర్తిచేశారు.