ప్రగతి మెరిసింది.. పల్లె నుండి పట్నంగా ఎదిగి మురిసింది కొత్త జిల్లా(2016) సిరిసిల్ల…

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్వి భజనలో రాజన్న సిరిసిల్ల కొత్త జిల్లాగా ఏర్పడిoది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులకు సంబంధించిన ర్యాంకింగ్‌లో తనదైన ముద్ర వేసుకుని దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న జిల్లా ఇదే స్ఫూర్తితో దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాల సాధనే లక్ష్యంగా పోటీ పడుతుంది. తొమ్మిది అంశాల్లో జిల్లా స్థాయిలో 27 పంచాయతీలు అవార్డులకు ఎంపికయ్యాయి. జిల్లాలో 13 మండలాల పరిధిలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే 2022 సంవత్సరానికి సంబంధించి కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాల పేరిట జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తొమ్మిది అంశాల్లో నిర్దేశించిన ప్రశ్నలు, అవసరమైన ధ్రువపత్రాలు జత చేసి అధికారులు దరఖాస్తులు సమర్పించారు. మండల స్థాయిలో ఎమ్పీడీవోలు, జిల్లా స్థాయిలో కలెక్టర్‌, రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీలు నామినేషన్‌లను పరిశీలిస్తాయి. ఇతర రాష్ట్రాల్లో గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న క్షేత్ర పరిశీలన బృందం పరిశీలించి జాతీయ పంచాయతీ పురస్కారానికి ఎంపిక చేస్తారు. సంబంధిత శాఖ అధికారుల పరిశీలన తర్వాత మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన పల్లెలను ప్రశంసా పత్రాలతో సత్కరించనుంది. మండల స్థాయిలో పురోగతి సాధించిన పల్లెలకు ఈ నెల 24, 25 తేదీల్లో తొమ్మిది అంశాల్లో 27 అవార్డులు పంపిణీ చేసింది. కాగా జిల్లా స్థాయిలో ఆయా అంశాల్లో అవార్డులు దక్కించుకున్న పల్లెలకు నేడు మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. పంచాయతీల మధ్య స్నేహపూర్వక పోటీతత్వాన్ని పెంచడంతో పాటు 2030 నాటికి సుస్థిర ప్రగతి లక్ష్యాలను వేగవంతం చేయడమే ఈ జాతీయ పురస్కారాల లక్ష్యం. జాతీయ స్థాయిలో సత్తా చాటిన గ్రామాలకు ఏప్రిల్‌ 24న పంచాయతీరాజ్‌ దినోత్సవం నాడు పురస్కారాలు అందజేయనున్నారు. జిల్లాకు చెందిన గ్రామాలు జాబితాల్లో ఉండాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు.
గతంలో ఇలా…జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. అభివృద్ధే లక్ష్యంగా అన్ని పంచాయతీ పాలక వర్గాలు పని చేస్తున్నాయి. దీని ఫలితంగా జిల్లా ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఫోర్‌ స్టార్‌ ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. జిల్లాలోని పల్లెలకు గడిచిన ఎనిమిదేళ్లుగా 11 జాతీయ అవార్డులు వరించాయి. 2015లో చందుర్తి, 2016లో బాలమల్లుపల్లి, చందుర్తి, రామన్నపల్లి, 2017లో కస్బెకట్కూర్‌, గోపాలరావుపల్లి, 2018లో ముష్టిపల్లి, 2021లో మోహినికుంట, హరిదాస్‌నగర్‌, 2022లో మండెపల్లి, మద్దికుంటలు జాతీయ స్థాయిలో మెరిశాయి. ఈ ఏడాది సైతం జాతీయ స్థాయి అవార్డుల్లో జిల్లాలోని పంచాయతీలు పురస్కారాలు సాధిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *