
విజయవాడ: విధి నిర్వహణలో పనిభారం, ఒత్తిడితో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో పోలీసు సిబ్బందికి ఆరోగ్య పరిరక్షణ అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు బుధవారం పలు ఆసుపత్రులలో ఏర్పాటైన మెడికల్ క్యాంపులను స్వయంగా పరిశీలించారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 4000 మంది పోలీసు సిబ్బందికి (హోంగార్డులతో సహా) సాధారణ బాడీ చెకప్, డయాబెటిక్ ప్రొఫైల్, కిడ్నీ, లివర్, లిపిడ్, కార్డియాటిక్ (ECG, 2D ఎకో) ప్రొఫైల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షల నిమిత్తం మేడ్ స్టార్, ఆంధ్రా, కామినేని, క్యాపిటల్, సెంటినీ, హెల్ప్ హాస్పిటల్స్ తో సంప్రదింపులు జరిపారు.
రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతుండగా, కమిషనరేట్ ఆధ్వర్యంలో ఖర్చులను పోలీస్ ఫండ్ ద్వారా భరించనున్నారు. ప్రతిరోజూ సుమారు 250 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
ఈ కార్యాచరణకు నోడల్ అధికారిగా ఏఆర్ఏ డీసీపీ కోటేశ్వరరావును నియమించారు. కమిషనర్ రాజశేఖర్ బాబు ఆర్‌ఏ డీసీపీ సరిత, ఇతర అధికారులతో కలిసి మేడ్ స్టార్, ఆంధ్రా, హెల్ప్ హాస్పిటల్స్ సందర్శించి, పరీక్షల ప్రక్రియను సమీక్షించి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.