కొవ్వూరు : పేదరికం కారణంగా నా పేదల చదువులు ఎంత మాత్రం ఆగరాదన్న లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు చదువులే పునాది అని పేర్కొన్న సీఎం జగన్ ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉన్నత చదువులు అందించడమే ధ్యేయంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నట్లు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు వేదికగా 2023 విద్యా సంవత్సరంలో జనవరి మార్చి త్రైమ్రాసికానికి సంబంధించి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 703 కోట్ల నిధులను సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా కొవ్వూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ గత నాలుగేళ్లలో కేవలం విద్యార్థుల ఉన్నత చదువుల కోసమే రూ. 14,912 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించకుండా పెండిరగ్ లో ఉంచిన రూ. 1,778 కోట్లను కూడా మన ప్రభుత్వంలో చెల్లించామని సీఎం జగన్ వివరించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మొదలైన చదువుల విప్లవం దేశానికి దశ దిశ చూపిస్తుందన్నారు. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు మానవ వనరులపై చేస్తున్న పెట్టుబడి అని దీంతో రాష్ట్ర సర్వతోముఖాభివ‘ద్ధి సాధ్యపడుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయని సమాజంలో వివక్ష పోవాలన్నా పేదరికం పోవాలన్నా చదవే గొప్ప అస్త్రంగా పనిచేస్తుందన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేదలు సామాజికంగా ఎదిగి ఆర్థికంగా బలపడాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.నాడు`నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నామని దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగిందని సీఎం జగన్ వివరించారు. ఉన్నత విద్యలో నాణ్యత కోసం కరిక్యులమ్ ను జాబ్ ఓరియోంటెడ్‌గా ఉండేటట్లు తీర్చిదిద్దామన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నాలుగేళ్ల హానర్స్ కోర్స్ ను ప్రవేశపెట్టిన అంశాన్ని గుర్తు చేశారు. పిల్లల్లో నైపుణ్యం పెంచేందుకు మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి: సీఎం జగన్‌ప్రతి పేద విద్యార్థి ఆర్థిక పరమైన కారణాలతో ఉన్నత చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలని తాను కోరుకుంటున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. దీని కోసం విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా చదువుల్లో రాణించాలని సూచించారు. ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి తోడుగా ఉంటామని సీఎం జగన్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చదువులపై చేస్తున్న ఖర్చుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మునిగిపోతోందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని కానీ తాను మాత్రం విద్యార్థుల చదువుల కోసం చేస్తున్న ఖర్చును హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తున్నానని ఇదే నా రాష్ట్రానికి భవిష్యత్తులో అండగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.