పెట్రోల్ లీటర్‌ రూ.15కే ఇస్తానంటూన్న రామర్‌ పిళ్లై’ నోట.. మళ్లీ పెట్రోలు మాట…


చెన్నై, ఏప్రిల్‌ 29
‘రామర్‌ పిళ్లై’ పేరు గుర్తుందా?.. అతి తక్కువ ధరకు మూలికా పెట్రోల్‌ విక్రయిస్తానంటూ రెండు దశాబ్దాల క్రితం ప్రకటించి, ఆనక అది నకిలీ పెట్రోల్‌ అని తేలడంతో కటకటాల పాలయ్యారు. ఆయన ఇప్పుడు మళ్లీ మూలికా పెట్రోల్‌ను ఉత్పత్తి చేస్తానంటూ విూడియా ముందుకొచ్చారు. తాను ఉత్పత్తి చేసే పెట్రోల్‌ను కేవలం రూ.15కే విక్రయిస్తానని కూడా ప్రకటించారు. తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లాలో ప్లాంట్‌ ఏర్పాటు చేసి, మూలికలతో పెట్రోల్‌ ఉత్పత్తి చేసి ప్రజలకు అందిస్తానని స్పష్టం చేశారు. రాజపాళయంలో ఇటీవల ఆయన, న్యాయ సలహాదారుడు చోకుస్వామి బాలసుబ్రమణ్యంతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. 1999లో తాను మూలికా పెట్రోల్‌ను కనిపెట్టి, తగిన అనుమతులు పొంది ప్లాంట్‌ ప్రారంభించానన్నారు. ఆ పెట్రోల్‌తో వచ్చే ప్రతి రూపాయికి పన్ను చెల్లించానన్నారు. అయితే అది మూలికా పెట్రోల్‌ కాదని, నకిలీ పెట్రోల్‌ అంటూ కొంతమంది చేసిన ఆరోపణలతో పోలీసులు విచారణ జరిపి తనను అరెస్టు చేశారన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించుకున్నానని తెలిపారు. తాను ఉత్పత్తి చేసే మూలికా పెట్రోల్‌తో వాహనాల నుంచి పొగ వెలువడదన్నారు. తనకు మద్దతు ఇచ్చేందుకు పులువురు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వచ్చారని, 40 రోజుల్లో రాజపాళయంలో కొత్త ప్లాంట్‌ నిర్మాణ పనులు ప్రారంభిస్తానని ప్రకటించారు.
అప్పట్లో ఏమైందంటే..?
మూలికా పెట్రోల్‌ ఉత్పత్తి చేస్తానంటూ 1999లో రామర్‌పిళ్లై ప్రకటించి, కార్యాచరణకు దిగారు. అయితే ఆయన రసాయనిక పదార్థాలతో పెట్రోల్‌ ఉత్పత్తి చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై 2000 సంవత్సరంలో సీబీఐ కేసు నమోదు చేసింది. 2016లో ఈ కేసును విచారించిన ఎగ్మూర్‌ కోర్టు రామర్‌ పిళ్లైకి మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించగా, అదనపు సెషన్స్‌ కోర్టు ఊరట కల్పించింది. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రామర్‌పిళ్లై ఇప్పుడు మళ్లీ మూలికా పెట్రోల్‌ ఉత్పత్తి చేస్తానంటూ విూడియా ముందుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *