శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో తీవ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఆర్మీ వాహనంపై ఉగ్రదాడికి పాల్పడ్డారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. భింబెర్ గలి ప్రాంతంలో వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఈ దాడికి తెగబడినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. ముష్కరులు గ్రనేడ్లు ఉపయోగించి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.ఒకవైపు భారీగా వర్షం… మరోవైపు ఆ ప్రాంతంలో విజిబిలిటీ (కంటికి కనబడే) తక్కువగా ఉండడం ఉగ్రవాదులకు సానుకూలమైందని ఉత్తర కమాండ్ ఆర్మీ హెడ్‌క్వాటర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘వాహనానికి నిప్పు అంటుకుంది. కాబట్టి తీవ్రవాదులు గ్రనేడ్లు ఉపయోగించి ఉండొచ్చు. ఆ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ల కోసం మోహరించిన రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన ఐదుగురు జవాన్లు ఈ ఘటనలో అసువులుబాశారు’’ అని ఆర్మీ పేర్కొంది. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడని, చికిత్స కోసం తక్షణమే హాస్పిటల్‌కు తరలించినట్టు వివరించారు. దాడికి పాల్పడ్డ వారి కోసం వేట మొదలైందని, ఆపరేషన్లు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. కాగా వాహనంపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల జాడ తెలియరాలేదని సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.