సిద్దిపేట : బీఆర్ఎస్ పార్టీ కన్నతల్లి లాంటిది.. కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కార్యకర్తల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉంటే మాట్లాడకుందాం.. కేసీఆర్ నాయకత్వాన్ని దేశ వ్యాప్తంగా బలపరచడానికి పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ గులాబీ జెండాను నుంగునూరు నుంచే ప్రారంభించారు. అందుకే ఈ సమావేశాలు ఇక్కడ ప్రారంభించామని తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడని పేర్కొన్నారు. సిద్దిపేట పేరును కేసీఆర్ ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్లాడు అని చెప్పారు. నాడు కరెంట్ ఉంటే వార్త, నేడు పోతే వార్త అయిందన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో లంచాలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బిస్కెట్ల మాదిరిగా ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రూ. 200 కోట్లు ఖర్చుపెట్టి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ద్వారా 18 వేల ఎకరాల్లో ఈ మండలంలో వరిసాగు చేశారని, ఈ పనులకు ఛత్తీస్‌గఢ్ నుండి కూలీలు వస్తున్నారని తెలిపారు. మనకు అల్లావుద్దీన్ దీపం కాదు కేసీఆర్ అనే దీపం ఉన్నాడు. కనుక అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. బీజేపీ అంబానీ, అదానీ ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తే, కేసీఆర్ రైతుల ఆదాయం పెంచుతున్నాడని హరీశ్‌రావు తెలిపారు. రైతులు కారులో వచ్చే కాలం రావాలి అనేది నా ప్రయత్నం అది దగ్గరలోనే ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు.