
సార్వత్రిక ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. వరుసగా మూడోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తాయని.. బీజేపీ గద్దె దిగడం ఖాయమని అమెరికా పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తంచేశారు. బీజేపీని ఇంటికి సాగనంపే సత్తా ప్రతిపక్ష కూటమికి ఉందన్న ఆయన.. దీనికి సంబంధించి అన్ని ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడిరచారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర విపక్ష నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీయేతర పార్టీలను ఏకంచేసేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెల ముంబయిలో పర్యటించిన నితీష్.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన(ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేలను కలిశారు. అలాగే కొల్‌కతాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, లక్నోలో అఖిలేష్ యాదవ్‌లను నితీష్ కుమార్ కలిశారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిపై వారితో చర్చించి.. పాట్నాలో నిర్వహించే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు. అటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతోనూ సమావేశమై ప్రతిపక్ష కూటమి ఏర్పాటుపై చర్చించారు. నితీష్ కుమార్ వెంట ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి ప్రసాద్ యాదవ్ కూడా ప్రతిపక్ష నేతలను కలిశారు. ఐక్య విపక్ష కూటమి ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడనుంది. పాట్నాలో నితీష్ నిర్వహించనున్న ప్రతిపక్ష పార్టీల ఐక్యతా సమావేశానికి ముహుర్తం ఖరారయ్యింది. జూన్ 23న నీతీష్ కుమార్ నిర్వహించనున్న ఈ సమావేశానికి.. వీలయినంత ఎక్కువ పార్టీలను ప్రతిపక్ష కూటమి కిందకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢల్లీి సీఎం అర్వింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులు హాజరవుతారని తెలుస్తోంది.ముందుగా జూన్ 12న ఈ సమావేశాన్ని పాట్నాలో నిర్వహించాలని జేడీయు, ఆర్జేడీ నేతలు భావించారు. అయితే తమను సంప్రదించకుండానే తేదీని ఖరారు చేయడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తంచేయడంతో ఈ సమావేశాన్ని వాయిదావేశారు. ఈ సమావేశాన్ని జూన్ 23న నిర్వహించాలని నిర్ణయించినట్లు పాట్నాలో తేజస్వి యాదవ్ వెల్లడిరచారు. ఈ సమావేశంలో యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, వామపక్ష సీనియర్ నేతలు డీ రాజా, సీతారాం ఏచూరీ, దీపన్‌కర్ భట్టాచార్య తదితరులు కూడా పాల్గొంటారని తేజస్వి యాదవ్ తెలిపారు.బీహార్‌లో బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి మహాకూటమి ఏర్పాటు చేయడంలో తన తండ్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, సీఎం నితీశ్ కుమార్ విజయం సాధించారని తేజస్వి యాదవ్ కొనియాడారు. ఇదే తరహాలో జాతీయ స్థాయిలోనూ బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ఇప్పుడు పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యానికి బీజేపీ పాతరవేస్తోందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే విపక్షాలను ఏకం చేస్తున్నట్లు తెలిపారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చే అంశంపై విపక్ష నేతలు చర్చించనున్నారు. బీజేపీ వ్యతిరేక ఓటు విపక్షాల మధ్య చీలిపోతే బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది.. అందుకే కనీసం 450 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీని ఢీకొనే ప్రతిపక్ష అభ్యర్థి ఒక్కరు మాత్రమే బరిలో నిలిచేలా చూడాలని భావిస్తున్నారు. తద్వారా బీజేపీ విజయావకాశాలను అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. పాట్నాలో ఈ అంశంపై ప్రతిపక్ష నేతలు ప్రధానంగా చర్చించే అవకాశముంది. ఈ ప్రతిపాదన మేరకు కాంగ్రెస్ ? బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండే రాష్ట్రాల్లో ఇతర విపక్ష అభ్యర్థులు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీపై కాంగ్రెస్ పోటీ చేయకూడదు. దీంతో అక్కడ బీజేపీ`ప్రాంతీయ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంటుంది. అయితే కేరళా తదితర కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలే ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటే అక్కడ ఈ అవగాహన సాధ్యంకాకపోవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీతో వివిధ ప్రతిపక్షాలకు ఏకీభావం కుదిరే అవకాశాలు బహు తక్కువ. కొన్ని రాష్ట్రాల్లో అది సాటి ప్రతిపక్షాలను ఎదుర్కోవలసి వుంటుంది. కాంగ్రెస్ లేకుండా మిగతా ప్రతిపక్షాలన్నీ ఒక్క త్రాటి విూదికి వస్తే ఎలా వుంటుందనే అంశం విూద కూడా చర్చ చాలానే జరిగింది. అది ఆశించిన ప్రయోజనం కలిగించబోదనే భయాలున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో వున్నా లేకపోయినా ఎక్కువ రాష్ట్రాల్లో ఉనికిని కలిగి వుంది. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఒంటరిగానే బిజెపితో పోరాడి కేంద్రంలో మళ్ళీ ఏకైక అధికార పక్షంగా చక్రం తిప్పుదామనే కోరిక దానిలో లేకపోలేదు. మొన్నటి కర్ణాటక విజయం తర్వాత అది ఇంకా పెరగి వుండవచ్చు. కాని మతతత్వ బలంతో ఉత్తరాదిలో బాగా వేళ్ళూనుకొన్న బిజెపిని కాంగ్రెస్ ఒంటరిగా ఓడిరచడం తేలిక కాదు. అందుచేత ఐక్య ప్రతిపక్షంతో కలిసి అడుగులు వేయక తప్పని పరిస్థితిలో అది వుంది. చివరికి బిజెపి వ్యతిరేక ప్రతిపక్ష కూటమి ఏ రూపు తీసుకొంటుందో ఇప్పటికైతే ఊహకు అతీతమైన విషయమే. కాని భారతీయ జనతా పార్టీ సెక్యులర్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక విలువలను బలి తీసుకొంటున్న తీరును గమనిస్తే దానిని మట్టి కరిపించే దిశగా ప్రతిపక్షాల మధ్య ఏ మేరకు అవగాహన కుదిరినా అది హర్షించదగినదే అనిపించడం ఆక్షేపించదగినది కాదు.