
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని, తక్షణమే కార్మికులకు అన్యాయం చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని మైదుకూరులో ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. మైదుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిప్యూటీ ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్ మాట్లాడుతూ — మోడీ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేసి, కార్మికులను నిరుద్యోగంలోకి నెట్టారని విమర్శించారు. కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్న విధంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చారని, వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడి వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రామీణ ఉపాధి హామీ పనిదినాలను 200 రోజులకు పెంచాలని, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను నిలిపేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు శాశ్వత చట్టం చేయాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని పేర్కొన్నారు. పంటలకు స్వామినాథన్ సిఫారసుల మేరకు మద్దతు ధర కల్పించాలని కోరారు.
కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న హామీని ఇంకా అమలు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కార్మిక హక్కులను పరిరక్షించకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్ నాయకులు భారతి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్, యూనియన్ నాయకులు ధనలక్ష్మి, వెంకట సుబ్బమ్మ, ప్రేమలలిత, వరలక్ష్మి, అనూష, వేదమ్మ, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.