కొత్త బిచ్చగాళ్లకు సీఎం కేసీఅర్ ను ఎదుర్కొనే దమ్ము లేదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలం, రాయకూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని సవాల్ చేశారు. నడిచే వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కొందరు కుట్ర చేస్తున్నారని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు.పేపర్ లీకేజీ దుర్మార్గమైన చర్యని, దొంగే దొంగ దొంగ అంటున్నారని, ఇంకా బుద్ధి రాకపోతే ప్రజలే ఎన్నికల్లో బొంద పెడతారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎవరికీ భయపడేది లేదని, బీజేకీకి 10 మంది ఉంటే మాకు 90 మంది ఉన్నారన్నారు. దమ్ముంటే గ్రామాల అభివృద్ధికి నిధులు తేవడంలో పోటీ పడాలన్నారు. కోట్లాది మంది ఆత్మీయుల ఆశీర్వాదం, అండ తమకు ఉన్నాయని, గతంలో రాజులు కత్తులతో యుద్ధాలు చేసేవారని, ఇప్పుడు ప్రజల ఆశీర్వాదం ఓటుతోనే యుద్ధం చేస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.