నెల్లూరు : ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనుచరుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. రూరల్ నియోజకవర్గంలోనూ అనిల్ అనుచరులు రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా ప్రభుత్వ, ప్రయివేటు భూములు, స్థలాల దురాక్రమణ జరుగుతోంది. అక్కచెరువుపాడులో ప్రయివేటు భూములని అనిల్ అనుచరులు ఆక్రమించారు. యజమానులు, అనిల్ అనుచరుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. అనిల్ వర్గీయులు ముప్పై మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. వైసీపీ పెద్దల దృష్టికి ఆదాల తీసుకువెళ్లినట్టు సమాచారం. ఇలాగైతే రూరల్ ఇన్ ఛార్జి బాధ్యతలు నిర్వహించలేనని ఎంపీ ఆదాల చెప్పినట్టు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.
వైసీపీ అధినేత జగన్ను ఎవరైనా విమర్శిస్తే ఒంటి కాలిపై లేచే వైసీపీ ఎమ్మెల్యేల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అయిన అనిల్ పరిస్థితి మంత్రి పదవి కోల్పోయాక కూడా ఆయన ఆగడాలు ఆగడం లేదు. ప్రతి ఒక్కరిపైనా నోరేసుకుని పడిపోతున్నారు. సవాళ్లకు దిగుతున్నారు. ఇక ఆయన అండ చూసుకుని అనుచరులు మరింత రెచ్చిపోతున్నారు. సొంత పార్టీ నాయకులు లేరు.. విపక్షాలన్న తేడా లేదని ఆదాల వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం బట్టి అర్ధమవుతోంది. ఇలాగైతే రూరల్ ఇన్ ఛార్జి బాధ్యతలు నిర్వహించలేనని ఎంపీ ఆదాల చెప్పారంటే అనిల్ ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో తెలుస్తోంది.