భక్తి అనేది ఓ నమ్మకం. దేవుడి నుంచి మోక్షం పొందేందుకు భక్తులు రకరకాల పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే.. ఇక్కడ మాత్రం పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. ఆయన కాలి తన్నుల కోసం భక్తులు బారులు తీరుతుంటారు. పూజరితో తన్నించుకోవడం కోసం చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అందరూ పోటీ పడతుంటారు. కాలితో తన్నించుకొన్న వారు మోక్షం పొందినట్టుగా భావిస్తుంటారు. అయితే.. ఈ తన్నుడు కథ గురించి తెలుసుకోవాలంటే.. ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం చిన్నహోతురు గ్రామానికి వెళ్లాల్సిందే. గ్రామంలోని శ్రీ సిద్ధరామేశ్వరస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి. అయితే.. ఈ ఆలయంలో ఏటా ఏప్రిల్ నెలలో రథోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున శివపార్వతులకు ఆలయంలో వైభవంగా కల్యాణం జరిపిస్తారు.ఆ కళ్యాణోత్సవం ముగిసిన తర్వాత.. భక్తులు ఆలయం ముందు వరస క్రమంలో భక్తులు బారులు తీరుతారు. అప్పుడు ఆలయ పూజారి.. స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తి విూద పెట్టుకొని ఒక చేతితో త్రిషులం పట్టుకొని.. నాట్యం చేస్తూ గుడి నుంచి బయటికి పరుగెత్తుకుంటూ వస్తారు. వరుస క్రమంలో ఉన్న కొందరి భక్తులను నాట్యం చేస్తూనే కాలితో తన్నుకుంటూ వెళ్తారు. పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామివార్లకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇలా తన్నటం వల్ల తమకు మోక్షం జరుగుతుందనే అభిప్రాయాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు.మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి శివుడు భక్తుడు. ఆయన 500 వందల సంవత్సరాలకు ముందే ఒక ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. ఆ ఆలయంలో స్వామివార్ల విగ్రహాలతో పాటు ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేసుకొన్నట్లు చెబుతున్నారు. ప్రతి ఏటా కర్ణాటకలోని హంపి వీరుపాక్షి స్వామి రధోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో.. అచ్చం అదే విధంగా చిన్నహోతురులో కూడా మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి కూడా నిర్వహించే వాడని పూర్వికులు చెబుతున్నారు. అయితే.. ఉత్సవాల చివరి రోజున శివ పార్వతులకు సిద్ధ రామేశ్వర స్వామి కళాణ్యం జరిపించేవారని.. ఆ కళ్యాణంలో స్వామివారి భక్తులు కొన్ని తప్పులు చేయటంతో.. ఆయన కుమారుడు వీరభద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట.వీరభద్ర స్వామి ఆలయ పూజారి రూపంలో.. గుడిలో ఉన్న త్రిశూలాన్ని తీసుకొని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను తల విూద ఉంచుకొని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అలా స్వామి వారి కాలి తన్నులు తిన్న వారికి మోక్షం జరిగిందని భక్తులు అంటున్నారు. దాదాపు 500 ఏళ్లకు ముందు నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని.. తాము ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెబుతున్నారు.పూజారి తన్నుల సేవా కార్యక్రమం ముగిసిన తరువాత స్వామి వార్లకు భక్తులు వసంతోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని గులాబీ రంగు ఉన్న నీటితో జరిపిస్తారు. స్వామివార్ల వసంతోత్సవం ముగిసిన వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకొన్న పెద్ద గుంతలలో గులాబీ రంగు నీళ్లు కలుపుకొని వారు కూడా ఆ గులాబీ రంగు నీళ్లతో వసంతోత్సవం జరుపుకొంటారు ఇది సంప్రదాయం అని గ్రామస్థులు చెబుతున్నారు.