డ్రెస్సింగ్‌ రూమ్‌లో ట్రంప్‌ నాపై బలవంతంగా అత్యాచారం చేశాడు…కోర్టులో సాక్ష్యం చెప్పిన కాలమిస్ట్‌ కారోల్‌


న్యూయార్క్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పై మరో లైంగిక వేధింపుల కేసు కోర్టులో విచారణకు వచ్చింది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ తనపై అత్యాచారం చేశాడని అమెరికన్‌ కాలమిస్ట్‌ ఇ.జీన్‌ కారోల్‌ తాజాగా యూఎస్‌ కోర్టులో సాక్ష్యం చెప్పారు.తనపై అత్యాచారం చేయడమే కాకుండా తన పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని యూఎస్‌ కోర్టులో కారోల్‌ పేర్కొన్నారు.‘‘మాన్‌హట్టన్‌లోని ఫిఫ్త్‌ అవెన్యూలోని బెర్గ్‌డార్ఫ్‌ గుడ్‌మాన్‌ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో డ్రెస్సింగ్‌ రూంలో డొనాల్డ్‌ ట్రంప్‌ నాపై అత్యాచారం చేశాడు’’ అని కారోల్‌ కోర్టులో జడ్జి ముందు చెప్పారు. అంతకు ముందు తనను మహిళల లోదుస్తుల కొనుగోలుపై ట్రంప్‌ సలహా అడిగి, ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కారోల్‌ వివరించారు.తన కంటే రెండిరతల పరిమాణం ఉన్న ట్రంప్‌ డ్రెస్సింగ్‌ రూంలోపల ఉన్న క్షణంలో అంతా మారిపోయిందని కారోల్‌ చెప్పారు.
అనంతరం తన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలతోపాటు తనను ఎగతాళి చేశాడని మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పై యూఎస్‌ సివిల్‌ కోర్టు విచారణలో ఆమె ఆరోపించారు.పోర్న్‌ స్టార్‌కి ట్రంప్‌ డబ్బు చెల్లింపునకు సంబంధించిన నేరారోపణలపై ట్రంప్‌ పై విచారణ జరిపిన కొద్ది వారాల తర్వాత కారోల్‌ కేసు విచారణకు వచ్చింది.లైంగిక వేధింపులకు గురైన బాధితులు… దాడులు జరిగిన దశాబ్దాల తర్వాత వారు దావా వేయడానికి వీలుగా న్యూయార్క్‌లో గత ఏడాది నవంబర్‌లో కొత్త చట్టం అమలులోకి వచ్చింది.దీంతో కారోల్‌ తరఫు న్యాయవాదులు కొత్త దావాను దాఖలు చేశారు.
డొనాల్డ్‌ ట్రంప్‌ 2024లో రెండవసారి అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న నేపథ్యంలో ఆయన చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌కు చేసిన డబ్బు చెల్లింపునకు సంబంధించిన క్రిమినల్‌ ఆరోపణలను ఎదుర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *