తిరుపతి : జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ బుధవారం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు యాగశాలలో మహాపూర్ణాహుతి, ఆ తరువాత కుంభప్రదక్షిణ చేపట్టారు. ఉదయం 7.30 నుంచి 8.15 గంటల మధ్య మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ, కళావాహన నిర్వహించారు. ఈ క్రతువుల ద్వారా యాగశాలలోని కలశాలలో ఇమిడి ఉన్న దేవతాశక్తిని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాల్లోకి ఆవాహన చేశారు. అనంతరం అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం అందించారు.భక్తులకు దర్శనం ప్రారంభం మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఉదయం 10 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. జమ్మూ నగరం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులందరికీ, తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు డా. జితేంద్ర సింగ్,శ్రీ కిషన్ రెడ్డి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి దంపతులు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జుగల్ కిషోర్ శర్మ, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ మెహతా, మేయర్ శ్రీరాజీందర్ శర్మ, జమ్మూ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ భరత్ భూషణ్, డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్, ఢల్లీి స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జెఈవో వీరబ్రహ్మం, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాలదీక్షితులు, కంకణభట్టార్ రామకృష్ణ దీక్షితులు, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్‌ఇలు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, విజివోలు మనోహర్, గిరిధర్ రావు, డెప్యూటీ ఈవోలు గుణభూషణ్ రెడ్డి, శివప్రసాద్, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇఇ సుధాకర్, డెప్యూటీ ఇఇలు రఘువర్మ, చెంగల్రాయలు, ఏఈవో కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.