ముంబాయ్ : గొంతు తడుపుకుందామంటే కూడా కిలోవిూటర్ల మేర వెళ్లాల్సిందే. నీటి కష్టాలు ఉన్న ప్రాంతంలో పుట్టిన ఓ బాలుడు.. రోజూ చెరువుకు వెళ్లి నీళ్లు తెస్తున్న తల్లి బాధను చూడలేకపోయాడు. మండుటెండల్లోనూ కాలినడకన వెళ్లి ఆమె బిందెలతో నీళ్లు తేవడాన్ని తట్టుకోలేకపోయాడు. తల్లి పడుతున్న కష్టాన్ని తీర్చాలనుకున్నాడు. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా ఇంటి ఆవరణలోనే బావిని తొవ్వేశాడు. భూగర్భం నుంచి ఉబికి వచ్చిన స్వచ్ఛమైన జలాలను చూసి ఆ బాలుడితో పాటు కుటుంబ సభ్యులు మురిసిపోయారు. తల్లి నీటి కష్టాలు తీర్చిన కుమారుడిపై స్థానికులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల కుర్రాడు ప్రణవ్ 9వ తరగతి చదువుతున్నాడు. ప్రణవ్ తల్లిదండ్రులు దర్శన, వినాయక సాల్కర్ రోజు వారీ కూలీలు. అయితే వారు ఉంటున్న దవంగే పడా ఏరియాలో నీటి కష్టాలు ఉన్నాయి. దీంతో తల్లి దర్శన ప్రతి రోజు సవిూపంలో ఉన్న ఓ చెరువు వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చేది. మండుటెండల్లోనూ ఆమె నీళ్ల కోసం పడరాని పాట్లు పడేది. తల్లి కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయిన ప్రణవ్.. తనకు సమయం దొరికినప్పుడల్లా.. ఇంటి ఆవరణలోనే ఓ బావిని తవ్వాడు. ఆ తర్వాత భూమిలో నుంచి స్వచ్ఛమైన జలాలు ఉబికి వచ్చాయి. ఇక ఇప్పుడు తల్లి చెరువుకు వెళ్లడం లేదు. బావిలో ఊరుతున్న నీటినే తాగడానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రణవ్ తల్లి దర్శన మాట్లాడుతూ.. తన కుమారుడు బావి తవ్వడంతో ఇప్పుడు నీటి కష్టాలు తీరాయి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. తన కొడుకును చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని ఆమె ఆనందభాష్పాలు రాల్చారు.తండ్రి వినాయక్ మాట్లాడుతూ.. ప్రణవ్ బావి తవ్వుతున్న సమయంలో తాను కేవలం అడ్డొచ్చిన రాళ్లను మాత్రమే బయటకు తీశాను. మిగతా పనంతా ప్రణవే చేశాడని తెలిపాడు. బావిలో నీరు చూసినప్పుడు తన కుమారుడి కష్టం గుర్తొస్తుంది. మొత్తానికి సంతోషంగా ఉందన్నాడు.అయితే మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో నీటి కష్టాలు లేవు. ఉద్యమ రథసారథి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు సురక్షితమైన మంచినీటిని అందిస్తున్నారు. ఇంటింటికీ నల్లా అందించి.. ఆడబిడ్డల నీటి కష్టాలు తీర్చారు కేసీఆర్. ఇప్పుడు తెలంగాణలో నీళ్ల బిందెల ప్రదర్శనలు లేవు. నీళ్ల కోసం మహిళలు బిందెలతో కాలినడకన వెళ్తున్న దృశ్యాలు కనిపించడం లేదు. అందుకే మహారాష్ట్రలోని పలు జిల్లాల ప్రజలు తమకు కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారు.