
సిద్ధిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో మత్తుపదార్థాల వ్యాప్తిని నియంత్రించేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎస్ఐ పి. అభిలాష్ నేతృత్వంలో నార్కోటిక్స్ డాగ్స్‌తో కలిసి అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో కిరాణా షాపులు, టీకొట్లు, పాన్ డబ్బాలు వంటి ప్రాంతాలు ప్రాధాన్యంగా ఉన్నాయి.
గంజాయి, మత్తుపదార్థాలు కలిపిన చాక్లెట్లు, ఇతర నిషేధిత పదార్థాలు ఎవరిదగ్గర అయినా లభించినచో, చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అభిలాష్ హెచ్చరించారు. మత్తుపదార్థాల వ్యసనం యువతను నాశనం చేస్తుందని, తాత్కాలిక ఆనందం కోసం జీవితాలను పాడుచేసుకోవద్దని ప్రజలకు సూచించారు.
అక్రమంగా గంజాయి లేదా మత్తు పదార్థాలు అమ్ముతూ గానీ, రవాణా చేస్తూ గానీ కనిపించినవారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇందుకోసం డయల్ 100, టోల్ ఫ్రీ నంబర్ 1908 లేదా నేరుగా కోహెడ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ సిబ్బంది, కోహెడ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.