
అరకులోయ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమ్మెకు భారీ స్పందన లభించింది. సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె లో భాగంగా, అరకులోయలోని పర్యాటక కేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు పని చేయలేదు. సిఐటియు మండల కార్యదర్శి జన్ని భగత్ రామ్ ఆధ్వర్యంలో జరిగిన సమ్మెలో, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ — కార్మికుల హక్కులు తొలగించే నూతన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్రంలోని పాలక బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాలను చౌకగా ప్రైవేట్ చేతుల్లోకి ఇచ్చేందుకు కుట్ర చేస్తోందని, తద్వారా ఎస్సీ, ఎస్టీ, బడుగు వర్గాలకు రిజర్వేషన్లకు ప్రమాదం పొంచి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో పార్లమెంట్‌లో చర్చ లేకుండా ఈ నాలుగు లేబర్ కోడ్స్ ఆమోదించడం ప్రజాస్వామ్య విఘాతం అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కోడ్స్‌ను అమలు చేయకుండానే పని గంటలను 8 నుంచి 10కి పెంచడాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను బానిసలుగా చూస్తున్నాయని అన్నారు. ధరలు పెరుగుతున్నప్పటికీ వేతనాలు పెంచడం లేదని విమర్శించారు.
అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. టూరిజం ప్రైవేటీకరణను నిరోధించాలని, గిరిజన హక్కులు పక్కన పెట్టే విధంగా ప్రైవేటీకరణ జరిగితే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించారు.
ఈ సమ్మెకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్, ఏపీ కాఫీ రైతు సంఘం, సిపిఎం, ఆదివాసి గిరిజన సంఘం, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్, ఆసుపత్రి వర్కర్స్, టూరిజం ఎంప్లాయిస్, సహకార సొసైటీ, మిడ్డే మిల్, ఆశ వర్కర్స్, గ్రామపంచాయతీ వర్కర్స్, జిసిసి వర్కర్స్, ఐకెపి వివోఏ తదితర సంఘాలు మద్దతు తెలిపాయి.