చెన్నై : బీజేపీ కోరిక పరిశీలించిన విూదట కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన విరమించుకున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. కర్ణాటక శాసనసభ ఎన్నికలు మే 10వ తేది జరునుండగా, నామినేషన్ల స్వీకరణ ఈ నెల 13న ప్రారంభమై 20వ తేదీతో ముగిసింది. ఈ విషయమై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి విడుదల చేసిన ప్రకటనలో, కర్ణాటక ఎన్నికల్లో పులికేశి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించి, అభ్యర్థిగా టి.అన్బరసన్‌ను ప్రకటించామన్నారు. ఈ నేపథ్యంలో, పులికేశి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచన విరమించుకొని తమకు మద్దతివ్వాలని బీజేపీ అధిష్ఠానం టెలిఫోన్ ద్వారా సంప్రదించిందని తెలిపారు. బీజేపీ కోరికను పార్టీ నేతలతో చర్చించామన్నారు. అందరి అభిప్రాయంతో అన్బరసన్ నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరినట్లు పళనిస్వామి తెలిపారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓపీఎస్ తరఫు అభ్యర్థులు ఇద్దరు నామినేషన్ ఉపసంహరించుకున్న నేపథ్యంలో, ఈపీఎస్ అభ్యర్థి కూడా నామినేషన్ వెనక్కు తీసుకున్నారు.