హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 40 మందికి ఈ లిస్ట్‌లో చోటు కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, మన్సూక్ మాండవీయ, భగవంత్ ఖూబా, ముఖ్యమంత్రులు బస్వరాజ్ బొమ్మై, యోగీ ఆదిత్యనాథ్ సింగ్, హిమంతబిశ్వ శర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. ఈ జాబితాలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి చోటు కల్పించారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు కల్పించారు. ఇప్పటికే డీకే అరుణ కర్ణాటక సహ ఇన్ చార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా కర్ణాటకకేలోనే ఉంటున్నారు. ఇక స్టార్ క్యాంపెయినర్లలో పేర్కొన్న వారంతా మే 10 జరగబోయే ఎన్నికల కోసం కాషాయ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొననున్నారు. డీకే అరుణ స్టార్ క్యాంపెనర్‌గా ఉండగా మిగతా తెలంగాణ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొననున్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా 8వ తేదీ సాయంత్రం ప్రచారానికి తెరపడనుంది. కనీసం రెండు వారాల పాటు తెలంగాణ నేతలు కర్ణాటకలో మకాం వేసే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి కర్ణాటక ఎన్నికలు అత్యంత కీలకం. అక్కడ అధికారాన్ని నిలబెట్టుకుంటే ఆ తర్వాత టార్గెట్ తెలంగాణ అవుతుంది. అక్కడ అధికారాన్ని పోగొట్టుకుంటే… మొదటికే మోసం వస్తుంది. అందుకే తెలంగాణ నేతలు కూడా కర్ణాటకలో గెలవడానికి తమ వంతు ప్రచార సాయం చేయడానికి రంగం సిద్దం చేసుకున్నారు.కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బలగం కర్ణాటకలో ప్రచారం చేయనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీలు అర్వింద్, సోయం బాపురావు సహా కర్ణాటకలో కొంత మందిపై అయినా కనీస మాత్రం ప్రభావం చూపగల నేతలు ఎవరైనా ఉంటే వారందర్నీ లిస్టవుట్ చేసుకున్నారు. చివరికి హైదరాబాద్ నగరానికి చెందిన కార్పోరేటర్లు కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు. చిన్న పాటి సభలు. సమావేశాలతో పాటు ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించే అవకాశం ఉంది. డీకే అరుణ నేరుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి పని చేయనున్నారు.