హైదరాబాద్ : మహిళా జర్నలిస్టులకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ఏప్రిల్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. బుధవారం సమాచార కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా జర్నలిస్టుల ఆరోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలని సంకల్పించారని వెల్లడిరచారు. మంత్రి కె.తారక రామారావు మహిళా జర్నలిస్టులకు భారీస్ధాయిలో వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఉచిత ఆరోగ్యపరీక్షల ఫలితంగా మహిళా జర్నలిస్టులకు ఆర్ధిక భారం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సదావకాశాన్ని మహిళా జర్నలిస్టులు వినియోగించుకోవాలని సూచించారు. కేసీఆర్ కిట్, కంటివెలుగు పరీక్షలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు లాంటి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున దేశంలో తెలంగాణ రాష్ట్రం మాతా,శిశు మరణాల రేటును తగ్గించడంలో ముందున్నదని ఆమె పేర్కొన్నారు. రెండవ దశ కంటి వెలుగు కార్యక్రమంలో ఒక కోటి 70 లక్షల మందికి కంటి పరీక్షలు చేయాలని సంకల్పించామని ఆమె అన్నారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మహిళా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మాస్టర్ హెల్త్ చెకప్ లో భాగంగా రక్త పరీక్ష, బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ దీ12, ణ3 మొదలైనవి, ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉంటాయని వెల్లడిరచారు. స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైనవి ఉంటాయని అన్నారు. ఈ పరీక్షల నివేదికలను అదే రోజున అందజేయనున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.