అమరావతి మే 8 : తెలంగాణలో అమరరాజా కంపెనీ ఏకంగా రూ. 9,500 కోట్ల పెట్టుబడి పెట్టడం… దాదాపు 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించే ‘అమరరాజా గిగా కారిడార్’కు శంకుస్థాపన జరగడం… దానికి మంత్రుల స్థాయి వ్యక్తులు హాజరయ్యి మాట్లాడడం.. ఇవేవిూ సంచలనాత్మక విషయాలు కాకపోవచ్చు, చర్చనీయాంశమూ కాకపోవచ్చు. కానీ అమరరాజా కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలివచ్చి తెలంగాణలో శంకుస్థాపన చేసుకోవడమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఏపీలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఇంతకీ ఏపీ ప్రజల్లో జరుగుతున్న ఆ చర్చ ఏమిటి?. కేటీఆర్ ప్రసంగానికి, ఏపీ సీఎం జగన్‌కు సంబంధం ఏమిటి?..
మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం ‘అమరరాజా గిగా కారిడార్’ శంకుస్థాపన కార్యక్రమం సందడిగా జరిగింది. గల్లా జయదేవ్, రామచంద్ర నాయడు, అరుణతోపాటు తెలంగాణ మంత్రులు కేటీఆర్ , శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌కు సవిూపంలో దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో ఈ లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీ ఏర్పాటు చేస్తుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కంపెనీ ద్వారా రూ.9,500 కోట్ల భారీ మొత్తంలో పెట్టబడి రానుంది. ఒకప్పుడు వలసలకు కేంద్రంగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీతో దశ మారనుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే అభిప్రాయాన్ని మంత్రి కేటీఆర్ కూడా వ్యక్తం చేశారు. ‘‘ ఒక పరిశ్రమ రావాలంటే దాని వెనుకాల తదేకమైన దీక్షతో, పట్టుదలతో పని చేస్తేనే వస్తాయి. ఇది పోటీ ప్రపంచం. పోటీ ప్రపంచంలో అవినీతి రహిత పారదర్శకమైన పాలనతో ముందుకు వెళ్తున్నాం. ఈ దేశంలో ఎక్కడైనా అమరరాజా గ్రూప్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. దివిటిపల్లిలో ప్లాంట్ పెడుతామని ప్రకటించిన తర్వాత 8 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు వారికి ఫోన్ చేసి తమ తమ రాష్ట్రాలకు రావాలని ఆహ్వానించారు. కానీ అమరరాజా గ్రూప్ వారు ఇక్కడే ప్లాంట్ ప్రారంభించేందుకు సముఖత వ్యక్తం చేశారు. దీక్షతో, పట్టుదలతో పని చేస్తేనే పెట్టుబడులు వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. కాబట్టి అందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే.. ప్రయివేటు రంగంలో పెట్టుబడులను ఆహ్వానించాలి. పరిశ్రమలకు ఊతమిస్తేనే కొలువులు వస్తాయి. రాష్ట్రానికి సంపద వస్తుంది. ఈ సంపదతో పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు ఉపయోగపడుతంది’’ అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ మాట్లాడిన ఈ మాటలే ఏపీలో ఇప్పుడు చర్ఛనీయాంశమయ్యాయి. దీనికి కారణంగా ఏపీ నుంచి తరలివెళ్లిన అమరరాజా కంపెనీ తెలంగాణలో తమ కంపెనీని ఏర్పాటు చేయడమే కారణంగా ఉంది. భారీ పెట్టుబడి పెట్టే కంపెనీని తెలంగాణకు అప్పగించారని సీఎం జగన్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.