హైదరాబాద్: సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు అన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన తెదేపా 41వ ఆవిర్భావ సభకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. అనంతరం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ‘‘41 సంవత్సరాల క్రితం చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29. అధికారం కావాలని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదు. తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని పార్టీ పెట్టారు. తెలుగుజాతి కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశమని చెప్పారు. తెలుగు జాతి వసుదైక కుటుంబంగా ఉండటం మనందరి అదృష్టం. మానవత్వమే తన సిద్ధాంతమని ఆనాడు ఎన్టీఆర్ చాటి చెప్పారు. ఎన్టీఆర్ తెచ్చిన పాలనా సంస్కరణలు చరిత్రలో ఎక్కడా లేవు. సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం. సంస్కరణలకు మారు పేరు ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశంపార్టీ ఉంటుంది. తెదేపాకు ముందు.. తర్వాత అని తెలుగుజాతి గురించి మాట్లాడే పరిస్థితి’’ అని చంద్రబాబు వివరించారు.
తెలుగు జాతికి పండుగ రోజు: అచ్చెన్నాయుడు – ‘‘యావత్ తెలుగు జాతికి ఇవాళ పండుగ రోజు. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు తెదేపా హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత తెలుగు జాతి చరిత్ర మారింది. పసుపు జెండా అంటే ఆత్మగౌరవమని గుర్తించాలి. ఎన్టీఆర్ వచ్చాక తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చింది. హైదరాబాద్ సిటీ విదేశాలతో పోటీ పడటానికి కారణం చంద్రబాబు. ఏపీకి ఒక మూరు?డు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రుల దురదృష్టకరం. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడానికి ఏపీలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. రాష్ట్రం విడిపోయినా తెలుగువారు అభివృద్ధి చెందాలనేదే చంద్రబాబు అభిమతం’’ అని అచ్చెన్నాయుడు అన్నారు. తెదేపా తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, తెదేపా అండమాన్ అధ్యక్షుడు మాణిక్‌రావు యాదవ్, నందమూరి బాలకృష్ణ, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు హాజరయ్యారు.