సికింద్రాబాద్- తిరుపతి మధ్య కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ గుంటూరు మీదుగా వెళ్లనుంది. ఏప్రిల్ 8న ప్రారంభించే అవకాశం. ఈ మార్గంలో ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత.. చాలా విజయవంతమైన లైన్ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రూట్ లో వందేభారత్ నడిస్తే.. సికింద్రాబాద్ -గుంటూరు మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గే అవకాశం ఉంది. అటు గుంటూరు నుంచి తిరుపతికి కూడా ప్రయాణ సమయం తగ్గుతుంది గనుక ఈ రూట్ విజయవంతమైన లైన్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
సికింద్రాబాద్ -తిరుపతి వందే భారత్ రైలును బీబీ నగర్- నడికుడి మార్గంలో మిర్యాలగూడ మీదుగా నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రైలును వరంగల్, ఖాజీపేట మార్గంలో నడపాలని రైల్వే అధికారులు భావించినప్పటికీ.. ఆ రూట్ లో దూరం ఎక్కువ అవుతుందినే, కారణంతో బీబీ నగర్ నడికుడి మార్గంలో నడపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీబీ నగర్ నుంచి గుంటూరు వరకు ఉన్న రూట్ లో రైల్వే ట్రాక్ ను గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
సికింద్రాబాద్- తిరుపతి మధ్య సాధారణంగా ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఈ మార్గంలో వందే భారత్ రైలును ప్రవేశపెడితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వందే భారత్ రైలుకు మునుముందు మరింత ఆదరణ పెరుగుతుందని అంటున్నారు. సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ రైలు వచ్చే అవకాశం ఉందని ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పారు. రైల్వే బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వందే భారత్ రైలు ను పరుగుపెట్టించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అతి త్వరలోనే ఈ రూట్ లో వందే భారత్ పరుగులు పెట్టనుండటంతో ఇటువైపు ప్రయాణించే ప్రయాణికుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మార్గంలో.. గంటకు 130 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో రైలు ప్రయాణించేలా రైల్వే ట్రాక్‌ను అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది. ఈ రూట్ లో.. వందే భారత్ రైలు టికెట్ ధర రూ.1100 నుంచి మొదలవుతుందని సమాచారం. సికింద్రాబాద్- తిరుపతి మధ్య ఈ మార్గంలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. ఈ రైలు ప్రయాణ సమయం 12 గంటలు. కాగా.. వందే భారత్ రైలు అందుబాటు లోకి వస్తే.. 6 నుంచి 7 గంటల సమయంలో తిరుపతికి వెళ్లొచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే.. ఏయే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందో ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. కానీ.. గుంటూరు, నెల్లూరులో తదితర స్టేషన్లో ఆగుతుందని తెలుస్తోంది.