ఇచ్చిన మాట నిలుపుకున్నా.. భావోద్వేగంతో కంటతడి పెట్టిన డీకే..


బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీ (ఆధిక్యత) దిశగా దూసుకుపోతుండంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఒక్కసారిగా భావోగ్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. కర్ణాటకలో విజయాన్ని సాధించి ఇస్తానని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తాను భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఎమోషన్‌కు గురయ్యారు. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గేకు కర్ణాటలో పార్టీని గెలిపిస్తానని మాటిచ్చానని, జైలులో ఉండగా తనను సోనియాగాంధీ కలుసుకున్నారని, అది ఎప్పటికీ మరిచిపోలేదని అన్నారు.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 140 సీట్లు గెలుచుకుంటుందని మొదట్నించీ డీకే ఢంకా బజాయిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సీఎం పదవికి పోటీ ఉందంటూ బీజేపీ చేసిన ప్రచారాన్ని కూడా మొదట్నించీ తిప్పికొడుతూ వచ్చారు. పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని, పార్టీ అధిష్ఠానం ఎవరిని సీఎంగా ఎంపిక చేసినా దానికి కట్టుబడి ఉంటానని పోలింగ్‌ ముందు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలలోనే ఆయన చెప్పుకొచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించి ఆ గెలుపును సోనియాగాంధీకి కానుకగా ఇవ్వనున్నట్టు కూడా ప్రకటించారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకే పట్టంకడుతూ తీర్పు ఇచ్చినట్టు ఫలితాలు వెలువడటంతో ఆ అంశాన్ని మరోసారి డీకే గుర్తుచేసుకుని భావోద్వాగానికి లోనయ్యాను. కాంగ్రెస్‌ కార్యాలయం తమకు ఆలయం వంటిందని, కాంగ్రెస్‌ కార్యాలయంలోనే తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *