
అమరావతి అభివృద్ధికి మళ్లీ నూతన దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుని, అభివృద్ధికి అనుకూలంగా అనేక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అమరావతిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్ అధికారుల నివాస సముదాయ భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.
రాజధాని అభివృద్ధిలో భాగంగా మరో 34,964 ఎకరాల భూసమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ భూసేకరణ 13 గ్రామాల పరిధిలో జరగనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సీబీఐకి అవసరమైన భూములను కేటాయించేందుకు ఆమోదం లభించింది. క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక రంగానికి రాజధాని పరిధిలో భూములు ఇవ్వడంపై కూడా ఆమోదం తెలిపింది.
భూమిలేని దాదాపు 1575 పేద కుటుంబాలకు పెండింగ్లో ఉన్న పెన్షన్లను కొనసాగించేందుకు మంత్రిమండలి ఆమోదించింది. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను కృష్ణ నది నుంచి డ్రెడ్జింగ్ ద్వారా తీసుకునేందుకు CRDAకు అనుమతినిచ్చింది.
ఇక జలవనరుల శాఖలో 71 పనులకు ఆమోదం లభించగా, వివిధ మీడియం ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు విడుదలయ్యాయి. హడ్కో ద్వారా అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం విమానాశ్రయాలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద వెయ్యి కోట్ల రుణాన్ని మంజూరు చేసింది.
తోట చంద్రయ్య హత్యలో బాధితుడైన ఆయన కుమారుడు వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ఆమోదం లభించింది. జల జీవన్ నీటి సరఫరా కార్పొరేషన్ ఏర్పాటుకు, మోటార్ వెహికల్స్ బిల్లులో, పరిశ్రమల బిల్లులో పలు చట్ట సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో APIIC పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం అదనంగా 790 ఎకరాల భూసేకరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నెల్లూరులో పెట్రో కెమికల్ పరిశ్రమ కోసం భూసేకరణ, 6 యూనిట్ల ఏర్పాటు, 2025-30కి గాను ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీకి ఆమోదం లభించింది. కోకో రైతులను ఆదుకునేందుకు రూ.14.88 కోట్ల మంజూరు నిర్ణయం తీసుకుంది.