కరీంనగర్ జిల్లాలో గత నాలుగు రోజుల కిందట కురిసిన వడగళ్ల వానతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా రూపొందించింది. వారి లెక్క ప్రకారం జిల్లాలో 23,116 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు గుర్తించారు. నాట్లు ముందుగా వేసిన రైతుల వరి పంట పొట్ట దశలో ఉండగా వడగళ్లతో దెబ్బతింది. అనుకున్న దిగుబడి రాకపోగా.. వచ్చిన ధాన్యం కాస్త తాలు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. మామిడి పంటను చూసి మురిసిపోయిన రైతన్న నెత్తిన పిడుగుపడిరది. మొక్కజొన్న, మిరప, పుచ్చ, కర్బూజ, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది.
యాసంగి సాగు ఇలా..
జిల్లాలో ఈసారి గతం కన్నా ఎక్కువగా 2,46,893 ఎకరాల్లో వరి వేశారు. తర్వాత స్థానంలో 23,514 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. తర్వాత స్థానాల్లో 3,454 ఎకరాల్లో వేరుసెనగ, 928 ఎకరాల్లో పొద్దు తిరుగుడు, 542 ఎకరాల్లో పెసర, 403 ఎకరాల శనగ తదితర పంటలతోపాటు మరో పది వేల ఎకరాల ఉద్యానవన పంటలు కలిపి 2,87,731 ఎకరాల్లో పంట సాగు చేశారు.
12 మండలాల్లో..
గంగాధర, రామడుగు, మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, చిగురుమామిడి, గన్నేరువరం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్ మండలాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. వరి 13,377, మొక్కజొన్న 7,888, మామిడి 1,619, పుచ్చకాయ 120, వివిధ రకాల కూరగాయల సాగు మరో 112 ఎకరాలు కలిపి 23,116 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం
జిల్లాలో పలుచోట్ల దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదారంగా ఆదుకుంటామన్న హామీతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి ఎకరాకు నష్ట పరిహారం అందేలా పకడ్బందీగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి, నివేదిక తయారు చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి విధివిధాన ాలు రాగానే క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా పంట నష్టం అంచనా వేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. వ్యవసాయ శాఖ నుంచి ఒకరు, రెవెన్యూ నుంచి ఒకరితోపాటు స్థానిక వ్యవసాయదారుతో కూడిన కమిటీ పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి అంచనా వేయనున్నట్లు సమాచారం.
పండిన వరి పంట నేలపాలు
గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన గుజ్జుల మునీందర్‌రెడ్డి యాసంగి ఆరంభంలోనే ఆరెకరాల్లో వరి పంట సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేల చొప్పున పెట్టుబడులు వెచ్చించి నాలుగుసార్లు క్రిమిసంహారక మందులు పిచికారీ చేశారు. వడగళ్లవానతో గింజలు రాలిపోగా, పంటంతా నేలవాలిపోయింది.
ఆరుగాలం శ్రమ ఆవిరైంది
కురిక్యాలకు చెందిన జాగిరపు నరసింహరెడ్డి అయిదెకరాల్లో మిరప పంట సాగు చేసి ఎకరాకు రూ.లక్ష చొప్పున పెట్టుబడులు వెచ్చించారు. మందులు పిచికారీ చేసి కంటికి రెప్పలా కాపాడుకున్నారు. పెట్టుబడులు పోనూ లాభాలు వస్తాయని ఆశించగా, వడగళ్ల వాన విరుచుకుపడిరది. తోట పూర్తిగా దెబ్బతింది. మూడున్నరెకరాల్లో కీరదోస, మూడెకరాల్లో టమాట తోటలు దెబ్బతిన్నాయి.
రాలిన మామిడికాయలతో నష్టం
చొప్పదండి మండలం భూపాలపట్నానికి చెందిన చిరంజీవి అనే రైతు రూ.14 లక్షలు వెచ్చించి చిట్యాలపల్లిలో 16 ఎకరాల్లో మామిడి తోటలు కౌలుకు తీసుకున్నారు. వడగళ్ల వానకు కాయలన్నీ నేలరాలి తీవ్ర నష్టం వాటిల్లింది. పెట్టుబడులు రాకుండా అప్పులపాలవుతామని ఆవేదన చెందుతున్నారు.
కాయలన్నీ పగిలిపోయాయి
చొప్పదండి మండలం కల్లెం జగన్మోహన్‌రెడ్డి అనే రైతు నాలుగున్నరె కరాల్లో పుచ్చతోట సాగు చేశారు. రూ.3 లక్షలు పెట్టుబడులు వెచ్చించగా వేసవిలో మంచి డిమాండు ఉండే ఈ ఫలంతో ఆదాయం సృష్టించుకోవచ్చని ఆశించారు. వడగళ్ల ధాటికి కాయలు పగిలి పనికిరాకుండా పోయాయి. నాలుగెకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు కూడా దెబ్బతిన్నాయి.
విధి విధానాలు రాగానే నివేదిక తయారు
పంట దెబ్బ తిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి విధివిధానాలు రాగానే పంట నష్టంపై నివేదిక తయారు చేసి, నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతాం.వాసిరెడ్డి శ్రీధర్, జిల్లా వ్యవసాయాధికారి