తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ఫైల్స్ పేరుతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై చేసిన ఆరోపణలపై డీఎంకే కన్నెర్ర చేసింది. అన్నామలైకి లీగల్ నోటీసులు పంపింది. 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. డీఎంకే 1.34 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిరదంటూ అన్నామలై ఆరోపించారు.రెండు రోజుల క్రితం అన్నామలై డీఎంకై ఫైల్స్ విడుదల చేశారు. మున్ముందు మరిన్ని ఫైల్స్ విడుదల చేస్తామన్నారు. చెన్నైలో మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు టెండర్‌ను ఓ సంస్థకు కేటాయించి ఎన్నికల నిధుల కోసం రూ.200 కోట్ల మేరకు ముడుపులు స్వీకరించినట్లు అన్నామలై స్టాలిన్‌పై ఆరోపణలు చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో డీఎంకే ఎంపీలు, మంత్రుల ఆస్తులు, అక్రమార్జనల వివరాలను విడుదల చేశారు. 2006 నుండి 2011 వరకు డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెన్నైలో మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అనుమతి లభించిందని, ఆ ప్రాజెక్టు కోసం జికా సంస్థ 59 శాతం, కేంద్ర ప్రభుత్వం 15 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 21 శాతం మేరకు నిధులు కేటాయించాయని, ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.14 వేల కోట్లుగా నిర్ణయించారని, ఆ తర్వాత ఎన్నికలు జరిగేందుకు 6 నెలల వ్యవధి ఉన్న సమయంలో అత్యవసరంగా టెండర్లు రూపొందించారని చెప్పారు. 2010 మే ఐదున కేంద్ర ప్రభుత్వం ఎక్జిమ్ పాలసీని తీసుకువచ్చిందని, విదేశీ సంస్థలు టెండర్ కోసం ప్రయత్నిస్తే ఆ టెండర్‌ను ఎలా అంచనా వేయాలనే నియమాలను ఎగ్జిమ్ పాలసీలో పేర్కొన్నారని అన్నామలై వివరించారు. ఎగ్జిమ్ పాలసీ అమలులోకి వచ్చిన తొమ్మిది రోజులలోపునే అంటే 2010 మే 14న టెండర్లు జారీ చేశారని చెప్పారు. నాడు అందులో మూడు సంస్థల పాల్గొన్నాయని, టెండర్లు కొద్ది రోజులపాటు తెరవని సమయంలో ఓ సవరణ తీసుకువచ్చారని, ఆ మేరకు టెండర్లో కస్టమ్స్ సుంకం అదనంగా చేర్చుతూ సవరణ తీసుకువచ్చారన్నారు. ఆలోపున ఫైనాన్షియల్ బిడ్‌ను సమర్పించటం పూర్తయ్యిందని, అయితే ఎగ్జిమ్ పాలసీ మేరకు కస్టమ్స్ పన్నును చేర్చకూడదనే షరతు ఉందని, ఇక కస్టమ్స్ పన్నును చేర్చకమునుపు రూ.1417 కోట్ల మేరకు చైనాకు చెందిన ఓ సంస్థ టెండర్‌కు అర్హత కలిగి ఉండటంతో, చైనా సంస్థ తర్వాతి స్థానంలో అంటే రెండో స్థానంలో రూ.1434 కోట్ల ఆఫర్‌తో ఆల్స్టామ్ సంస్థ ఉండేదని, కస్టమ్స్ పన్నును చేర్చిన దరిమిలా రెండో స్థానంలో ఉన్న ఆల్స్టామ్ సంస్థ మొదటి స్థానానికి చేరుకుందని, టెండర్ ముగిసిన తర్వాత కస్టమ్స్ పన్నుల మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారని, కానీ టెండర్‌ను ఆల్స్టామ్ సంస్థకే అప్పగించారని అన్నామలై ఆరోపించారు. ఆల్స్టామ్ సంస్థ ముడుపుల ద్వారానే టెండర్లు దక్కించుకోవడటం ఆనవాయితీ అని, ఆ కారణంగానే అమెరికాలో ఆ సంస్థకు 771 మిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఆల్స్టామ్ సంస్థ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు రూ.200 కోట్లు చెల్లించినట్లు ఆరోపించారు. ఆ ముడుపులు రెండు దేశాలకు చెందిన షెల్ సంస్థల ద్వారా అందాయని పేర్కొన్నారు. 2011 శాసనసభ ఎన్నికల విరాళం రూపంలో రూ.200 కోట్ల ముడుపులు చెల్లించారని ఆయన తెలిపారు.డీఎంకే అవినీతి గురించి సీబీఐకి తాను త్వరలో ఫిర్యాదు చేయనున్నానని, మెట్రోరైలు ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం 15 శాతం నిధులు కేటాయించడ వల్ల ఈ కేసును సీబీఐ విచారణ జరిపేందుకు వీలుందని కూడా అన్నామలై చెప్పారు.వాస్తవానికి అన్నామలై ఆరోపణలు చేసిన రోజే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంకే హెచ్చరించింది. అన్నంత పనీ చేసింది. లీగల్ నోటీసులపై అన్నామలై స్పందించాల్సి ఉంది.